Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత పోరులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ గెలుపు క్రెడిట్‌ను ఎవరికి ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. క్రైస్ట్‌ చర్చ్‌లోని హేగ్లే ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన భారత జట్టు ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ పూర్తిగా చేజారిపోతుందనే సమయంలో యువ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ భారత్ అద్భుతమైన విజయం సాధించిందని, జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని నిరూపించారని స్పష్టం చేశాడు. వికెట్లు పడుతున్న సమయంలో మ్యాచ్ తమ చేజారిపోతుందనే భయం కలిగిందని నిజాయితీగా అంగీకరించాడు. అయితే ఆ క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారని వారిని కొనియాడాడు. అలాగే నమన్ ధీర్ ఆడిన చిన్నదైనా కీలకమైన ఇన్నింగ్స్‌ను అయ్యర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. దేశవాళీ టోర్నీల్లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ నమన్ రాణించాడని గుర్తుచేశాడు. అతను కేవలం బ్యాటరే కాకుండా మంచి బౌలర్ కూడా అని, ఇలాంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం వల్ల అదనపు బలం చేకూరుతుందని తెలిపాడు.

మధ్య ఓవర్లలో కీవీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశారని అయ్యర్ పేర్కొన్నాడు. ఆ సమయంలో తాము కొన్ని డాట్ బాల్స్ ఆడటం వల్ల రన్‌రేట్ ఒత్తిడి పెరిగిందని, అయినప్పటికీ నితీష్, తిలక్ ఆ వత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చారని తెలిపాడు. ఇక, ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పటికీ, ఇప్పుడే సంబరాలు చేసుకునే సమయం రాలేదని అయ్యర్ స్పష్టం చేశాడు. తమ లక్ష్యంలో సగం మాత్రమే పూర్తయిందని, సిరీస్‌ను పూర్తిగా కైవసం చేసుకోవాలంటే రాబోయే మ్యాచ్‌లలోనూ ఇదే జోరును కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అంటే “ముందుంది మొసళ్ల పండగ” అన్న రీతిలో వివరణ ఇచ్చాడు. ఇక, ఫీల్డింగ్ విషయంలోనూ జట్టుకు స్పష్టమైన ప్రణాళిక ఉందని, ప్రత్యర్థి జట్టు డబుల్స్ తీయకుండా మైదానంలో ప్రతి బంతికీ అప్రమత్తంగా ఉండాలని ఆటగాళ్లకు సూచించినట్లు తెలిపాడు. సింగిల్స్ మాత్రమే ఇచ్చేలా, ప్రత్యర్థులు రెండో పరుగు గురించి ఆలోచించేసరికి ఫీల్డర్లు బంతిని అందుకునేలా వేగంగా కదలాలని మెసేజ్ ఇచ్చినట్లు వివరించాడు.