Amaravati : పెండింగ్ లో ఉన్న చిట్ ఫండ్ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్లు స్టాంపుల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన రిజిస్ట్రేషన్లు స్టాంపుల ఐజీ, అదనపు ఐజీ, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు. రిజిస్ట్రేషన్ల ద్వారా కొన్ని జిల్లాల రెవెన్యూ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని సమావేశంలో స్పష్టీకరించారు. కాకినాడ, విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళంలను ప్రీమియం రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రజత్ భార్గవ సూచించారు. అలాగే, డిసెంబరు 31 లోగా ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లు ఏర్పాటు కోసం భవనాలను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Read Also: Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
ఈ కేంద్రాలన్నీ అవినీతి రహితంగా సేవలందించేలా తీర్చిదిద్దాలని రజత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రెండు వేల గ్రామ వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల సేవలు అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. చిట్ ఫండ్ నిర్వాహకులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న చిట్ ఫండ్ కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రజత్ భార్గవ అధికారులకు సూచించారు. చిట్ ఫండ్ కంపెనీలకు కొత్తగా అనుమతులు జారీ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాల్లోకి మార్పులు చేయాలన్నారు. అలాగే రికార్డులను డిజిటలైజ్ చేయాలంటూ ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో ముందు వరుసలో విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు.