Warangal: వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తుండగా, పోలీసులు ఆధారాలను అనుసరించి కీలక నిందితులను పట్టుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నానికి సంగారెడ్డిలోనే పథకం రూపొందించారని పోలీసులు గుర్తించారు. రెండు బైకులపై ముగ్గురు వ్యక్తులు డాక్టర్ సుమంత్ రెడ్డిని వెంబడించి, వరంగల్‌లో నడి రోడ్డుపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ ఘోరమైన ఘటనలో ప్రధాన నిందితులుగా డాక్టర్ భార్య ఫ్లోరా ప్రియుడు సామెల్, అతనికి AR కానిస్టేబుల్ రాజు ఉన్నారని పోలీసులు ధృవీకరించారు.
Read Also: NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్
డాక్టర్ సుమంత్ రెడ్డి తన భార్య ఫ్లోరా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న తర్వాత వారి కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి. సుమంత్ రెడ్డి గతంలో సంగారెడ్డిలో డాక్టర్ గా పని చేసిన సమయంలో, ఫ్లోరా జిమ్ కు వెళ్లేటప్పుడు సామెల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలుస్తోంది. సుమంత్ ఈ విషయాన్ని గమనించి భార్యను మందలించడంతో, ఫ్లోరా అతనిపై కోపంతో ఉండేది. ఈ నేపథ్యంలో తన భర్తను హత్య చేయించి, ప్రియుడితో కలిసి జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఫ్లోరా ఈ ఘాతుక పథకానికి శ్రీకారం చుట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Read Also: Internet : ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్ని గంటలు ఇంటర్నెట్ నిలిచిపోతుందో తెలుసా ?
ఫ్లోరా ప్రియుడు సామెల్, హత్యాయత్నం కోసం గచ్చిబౌలిలో పనిచేస్తున్న AR కానిస్టేబుల్ రాజు సహాయం తీసుకున్నాడు. రాజు సహకారంతో సుమంత్ పై దాడి చేయాలని కుట్ర పన్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు కలిసి వరంగల్ లో సుమంత్ రెడ్డి కారును అడ్డగించి అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ హత్యాయత్నాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు నిందితులు ముందుగా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, డాక్టర్ సుమంత్ తల్లిదండ్రులు కోడలు ఫ్లోరా తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులను మహారాష్ట్రలో అరెస్టు చేసి, వారిని వరంగల్ కు తీసుకొస్తున్నట్టు సమాచారం. నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టిన అనంతరం, వారిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా.. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.