AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన యువకుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. తన భార్యను తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో యువకుడిని హతమార్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె రూరల్ మండలం మాలెపాడు గ్రామం ఆవులపల్లెకు చెందిన ఆవుల నర్సింహులుకు, భార్య విజయలక్ష్మి, పిల్లలు యమున, త్రిష, హితేష్ ఉన్నారు. నర్సింహులు తాంత్రిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నర్సింహులుకు కర్లమడుగు క్రాస్ గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఉంది. దీంతో తరచూ నర్సింహులు.. నాగరాజు ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య గంగాదేవిని నర్సింహులు తన తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర బంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. నాగరాజుకు విషయం తెలిసి ఆగ్రహించాడు. పలు మార్లు గొడవ పడ్డాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు.
Read Also: Congress: ‘‘ వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
అయితే, నర్సింహులు తీరు మారలేదు. దీంతో ఎలాగైనా అతన్ని హతమార్చాలని పథకం పన్నాడు నాగరాజు. ముందస్తు పథకం ప్రకారం అక్టోబర్ 27న చంద్రగిరిలో తాంత్రిక వైద్యం చేయాలని ఆవుల నరసింహులును స్థానికంగా ఉంటున్న నారాయణస్వామి, కత్తి నరసింహులును మదనపల్లెలో బస్సు ఎక్కించి పంపించాడు. వాళ్లకు తెలియకుండా వెనక మరో బస్సు ఎక్కి శ్రీనివాసమంగాపురంలో నాగరాజు దిగాడు. నరసింగాపురంలోని మునిరాజకు ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం ఆవుల నరసింహులు ఒక్కడినే శ్రీనివాసమంగాపురానికి పిలిపించారు. ద్విచక్ర వాహనంలో అతడిని ఎక్కించుకుని.. నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మామిడి తోపులోకి నాగరాజు, మునిరాజు తీసుకెళ్లారు. అక్కడ కాళ్లు చేతులు కట్టి, నోటికి ప్లాస్టర్ అంటించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నాలుగు అడుగుల గొయ్యి తీసి పూడ్చి వేశారు. మరోవైపు ఆవుల నరసింహులు కనిపించడంలేదని అతని భార్య మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్నేహితులనూ విచారించగా.. నాగరాజ, మునిరాజు హత్య చేసినట్లు తెలిసింది. దీంతో మదనపల్లె పోలీసులు గురువారం నిందితులను తీసుకొచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
