హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచే శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భాగ్యనగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ గ్రేడ్ సెపరేటర్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్‌సీ నెం.7 (LC No.7) వద్ద ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 71 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పొడవు 490 మీటర్లు. ఇందులో రైల్వే ట్రాక్ మీద ఉండే కీలకమైన భాగం 37.28 మీటర్లుగా ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిని 16.60 మీటర్ల వెడల్పుతో, రెండు వైపులా రెండేసి లేన్లతో మొత్తం నాలుగు లేన్ల రహదారిగా అత్యాధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దారు.
ఈ వంతెన నిర్మాణంలో ఇంజనీరింగ్ నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓపెన్ ఫౌండేషన్లు, సింగిల్ పియర్‌లు, ఆర్‌సీసీ ప్రీకాస్ట్ పియర్ క్యాప్స్‌తో సబ్‌స్ట్రక్చర్‌ను రూపొందించగా, దృఢత్వం కోసం స్టీల్ గిర్డర్లతో సూపర్‌స్ట్రక్చర్‌ను నిర్మించారు. రక్షణ, మన్నిక కోసం మోడ్యులర్, స్ట్రిప్ సీల్ ఎక్స్‌పాన్షన్ జాయింట్లు, అత్యాధునిక బేరింగ్స్ ఉపయోగించారు. అప్రోచ్ మార్గాల్లో భూమి కోతకు గురికాకుండా జియో స్ట్రిప్స్‌తో కూడిన రిటైనింగ్ వాల్స్ , క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయడం విశేషం.
Also Read:Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..
ఈ ROB అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీ , పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. మెయిలార్దేవ్‌పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్‌నుమా ఆర్టీసీ డిపో వరకు వెళ్లే ప్రయాణికులకు సుమారు 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. గతంలో రైల్వే గేటు పడినప్పుడల్లా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేవి. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా రాకపోకలు సాగించవచ్చు.
ట్రాఫిక్ జామ్‌లు తగ్గడం వల్ల వాహనాల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుంది, తద్వారా వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం కూడా తగ్గుముఖం పడతాయి. నగరంలోని కీలకమైన దక్షిణ ప్రాంతానికి ఈ బ్రిడ్జి ఒక ‘లైఫ్ లైన్’ లాగా పనిచేయడమే కాకుండా, సమీప ప్రాంతాల ఆర్థిక వృద్ధికి మరియు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తికావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
