Site icon NTV Telugu

Shashi Tharoor: శశి థరూర్ యూటర్న్.. రాహూల్ గాంధీపై పొగడ్తల వర్షం!

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చెక్ పెట్టారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కలిసిన మరుసటి రోజే థరూర్ ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శశిథరూర్‌ కొన్ని నెలలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోడీపై సానుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. సడెన్‌గా ఆయన ప్రవర్తన మాడంతో కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ఊహాగాను వచ్చాయి. ఎన్నో నెలలుగా ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నప్పటికీ వీటిపై స్పందించలేదు. తాజాగా ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం స్పందించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన థరూర్.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుపుకోసం తాను ముందుండి పనిచేస్తానని చెప్పారు. కేరళ ప్రచారంలో చురుకుగా పాల్గొంటానని, కాంగ్రెస్‌కు బలంగా నిలుస్తానని తెలిపారు. తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలకు ఎలాంటి ఆధారం లేదని తేల్చిచెప్పారు.

READ MORE: Salman Ali Agha: ప్రపంచ కప్‌లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..

ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌కు స్పష్టమైన రాజకీయ ఆలోచన ఉందని, సాంప్రదాయ విభజనకు వ్యతిరేకంగా నిలబడే నాయకుడని అన్నారు. తన దృష్టి అంతర్గత రాజకీయాలపై కాదని, దేశానికి సంబంధించిన అంశాలపైనేనని స్పష్టం చేశారు. 2009 నుంచి తాను ఇదే తరహా వైఖరిని కనబరుస్తున్నానని, పార్టీ అధికారిక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. తన విధేయతపై పదే పదే ప్రశ్నలు రావడంపై థరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి సందేహాలు తనకే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని, అయినా తాను కాంగ్రెస్‌తోనే గట్టిగా నిలబడతానని చెప్పారు. ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన భేటీ గురించి థరూర్ వివరించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ సమావేశం గంట నలభై ఐదు నిమిషాల పాటు సాగిందని తెలిపారు. ఈ సమావేశంలో తన ఆవేదనలను నాయకుల దృష్టికి తీసుకెళ్లానని, చర్చ చాలా సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని అన్నారు. ఇప్పుడు అందరం ఒకే దారిలో కలిసి ముందుకు సాగుతున్నామని, ఇక చెప్పడానికి ఏమి మిగలలేదని వ్యాఖ్యానించారు.

READ MORE: Greatest T20 Cricketer: ఏకంగా ఏడు సార్లు.. విరాట్ కోహ్లీ ఆధిపత్యం మాములుగా లేదుగా!

Exit mobile version