Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!

Sharwanand

Sharwanand

Sharwanand: విజయవాడలో జరిగిన ‘భోగి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది విజయదశమి రోజున చిన్నాన్నతో కలిసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు 10K రన్‌లో పాల్గొన్నప్పుడే మరుసటి ఏడాది తప్పకుండా వస్తానని చెప్పానని, ఈసారి మరింత ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు గుర్తుకొచ్చేవని, ఇప్పుడు విజయవాడ దసరా ఉత్సవాలు అంతటి ఖ్యాతిని గడించాయని, ఈ వేడుకలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ తన పుట్టినూరు అని, ఇక్కడితో తనకు ఎంతో బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉందని శర్వానంద్ చెప్పారు. “వేసవి సెలవుల్లో విజయవాడకు వస్తూ ఉండేవాడిని. మా తాతగారు సిద్ధార్థ అకాడమీ ఫౌండర్. అక్కడి సిద్ధార్థ కాలేజీల నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. చిన్నప్పుడు ఇక్కడి రోడ్లపై గంటకు అర్ధ రూపాయి అద్దె చెల్లించి సైకిల్ తొక్కిన మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి” అని పాత రోజులను నెమరువేసుకున్నారు. అన్నింటికంటే మిన్నగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ తన వెంటే ఉంటాయని, ఆ తల్లి అనుగ్రహం వల్లే ఈ ఏడాది తనకు రెండు విజయాలు దక్కాయని, విజయదశమి పర్వదినాన అమ్మవారి ఆశీస్సులతోనే కొత్త సినిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నానని చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లతో ఉన్న తాను, ‘భోగి’ చిత్రంతో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. “ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ సినిమాలు చేసే శర్వానంద్ ఇంత భారీ కమర్షియల్ మాస్ సినిమా చేయగలడా అనే అనుమానం మొదట్లో నాకూ ఉంది. కానీ ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాను రూపొందించాం. ఇది ఒక అన్నచెల్లెళ్ల కథ. ఒక పక్క కృష్ణమ్మ నీరిస్తుందనే భరోసా, అమ్మవారి రక్షణ, వెన్నంటి నిలిచే కుటుంబం, అండగా ఉండే పేరెంట్స్, నడిపించే స్నేహితులు ఉంటారనే నమ్మకంతోనే మనమంతా బతుకుతాం. ఆ నమ్మకాన్ని వమ్ముచేసి వెన్నుపోటు పొడిస్తే, ఎక్కడున్నా వెతికి మరీ నాశనం చేసేవాడే ఈ కథలోని గంగ. ఆ గంగ కాస్తా పెనుగంగగా ఎలా మారాడన్నదే ‘భోగి’ అసలు కథ” అని వివరించారు.

తన కెరీర్‌లోనే ఇంతటి వైలెంట్ సినిమాను ఎప్పుడూ చేయలేదని, కానీ ఒక గొప్ప చిత్రాన్ని తీశానని గర్వంగా చెప్పుకోగలనని శర్వానంద్ పేర్కొన్నారు. ప్రేక్షకులను మెప్పించే సరికొత్త యాక్షన్ విందును సిద్ధం చేశామని, నవంబర్ 12న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ, సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ మీట్‌ను కూడా ఇక్కడే ఘనంగా జరుపుకుందామని ముగించారు.