మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నాయి. అదే సమయంలో.. మహా వికాస్ అఘాడీ (MVA) మరోసారి నిరాశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పోకడల మధ్య, భారతీయ రాజకీయ ప్రముఖుడు, ఎన్‌సీపీ(SP) అధినేత శరద్ పవార్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ పనితీరు వారసత్వంపై పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు.. ఇప్పుడు మాత్రం వెనుకపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13,ఉద్ధవ్ థాకరే(SHSUBT)పార్టీ 9, శరద్ పవార్ (NCPSP) పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ మూడు పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చిన నివేదిక ప్రకారం.. 87 స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం ఎన్‌సీపీ 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇది శరద్ పవార్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదట. ఇప్పటి వరకు శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సీపీకి 11.58% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 10.58% ఓట్లు రాగా, ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేనకు 10.67% ఓట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 32.83% ఓట్లు రాగా.. బీజేపీ, అజిత్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమికి 48.73% ఓట్లు వచ్చాయి.
ఆయనే నిండా ముంచేశారా?
తన రాజ్యసభ పదవీకాలం 2026లో ముగియడంతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు శరద్ పవార్ ఇటీవల తన ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రభావం ఎలెక్షన్స్‌లో గట్టిగా పడినట్టు తెలుస్తోంది. ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం ఎన్సీపీతో పాటు, కాంగ్రెస్ , ఉద్ధవ్ థాకరే పార్టీలను నిండా ముంచినట్టు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా ఉన్నంతగా, అసెంబ్లీ ఎన్నికల్లో లేవని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్రలో పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు బీజేపీ కూటమికి పడ్డాయని నిపుణులు తేల్చేశారు. కాగా.. నిర్ణయం ఆయన పార్టీకి పెను సవాలుగా మారనుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇదే ఆయనకు చివరి ఎన్నికలు అయితే, ఈ ఎన్నికల ఫలితం ఆయన కెరీర్‌కు మరకగా మారనుంది. ఇది శరద్ పవార్‌ను ఎప్పుడూ పీడకలలా వెంటాడుతుంది.