నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించారు. కొన్ని రోజుల క్రితం, హోం మంత్రిత్వ శాఖ ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని నిర్ణయించింది. ఆయన భద్రత కోసం సీఆర్పీఎఫ్ కమాండోలను మోహరించారు. శరద్ పవార్ తనపై ఎలాంటి బెదిరింపు కాల్ ఉందో మొదట తనిఖీ చేస్తానని, ఆ తర్వాత మాత్రమే భద్రతను తీసుకోవడం గురించి ఆలోచిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులను కూడా ఆయన సమాచారం కోరారు. ప్రస్తుతం, శరద్ పవార్ ఈరోజు జెడ్ ప్లస్ భద్రతను తీసుకోవడానికి నిరాకరించారు. ఈ విషయంలో ఆయన తదుపరి నిర్ణయంపై అందరూ ఎదురుచూస్తున్నారు.
కాగా.. ఇటీవల బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కి కేంద్రం భద్రతను పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ‘‘జెడ్-ప్లస్’’ కేటగిరి నుంచి మరింత పటిష్టమైన అధునాతన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏఎస్ఎల్ ప్రోటోకాల్‌కి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సమానంగా భగవత్‌కి భద్రతను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహన్ భగవత్‌కి భద్రతను అందిస్తోంది. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ‘‘ప్రెష్ రిస్క్ అసెస్‌మెంట్’’ అంచనాల తర్వాత ఈ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో సహా వివిధ సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ భగవత్‌తో పాటు దేశంలోని 10 మంది వ్యక్తులకు మాత్రమే జెడ్-ప్లస్ కేటగిరి భద్రత ఉంది. ఇప్పుడు దానిని ఏఎస్ఎల్ భద్రతకు పెంచారు.
