టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కెరీర్ మొదట్లో తనతో జరిపిన సంభాషణను వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలో షార్ట్ బాల్‌లకు అవుట్ అయిన విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడని, తాను సరిగ్గా బ్యాటింగ్ చేయలేనా? అనే అనుమానాలు పెంచుకున్నాడని తెలిపాడు. టెస్ట్ క్రికెట్‌లో పది వేల పరుగులు చేయకపోతే నువ్వు సిగ్గుపడాలని తాను కోహ్లీతో అన్నానని భజ్జి చెప్పుకొచ్చాడు. తరువార్ కోహ్లీ పోడ్‌కాస్ట్‌లో కోహ్లీకి సంబంధించిన పలు విషయాలను హర్భజన్ చెప్పాడు.
‘విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. శ్రీలంకతో వన్డే సిరీస్ జరుగుతోంది. స్పిన్నర్ అజంతా మెండిస్ వికెట్లు తీస్తున్నాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ అనంతరం నా వద్దకు వచ్చి పాజీ (అన్న) నేను ఎలా ఆడాను?’ అని అడగ్గా.. బాగా ఆడావని చెప్పా. నేను ఔట్ కాకుండా మరిన్ని రన్స్ చేయాల్సిందన్నాడు. అతడి యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు.
‘విరాట్ కోహ్లీ టెస్ట్ అరంగేట్రం వెస్టిండీస్‌పై జరిగింది. విండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ షార్ట్ బాల్‌తో కోహ్లీని అవుట్ చేశాడు. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. నా వద్దకు వచ్చి మాట్లాడాడు. సరిగ్గా బ్యాటింగ్ చేయలేనా? అనే అనుమానాలు వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 10000 రన్స్ చేయకపోతే నువ్వు సిగ్గుపడాలని నేను అతడితో అన్నాను. నీకు టెస్టుల్లో 10 వేల రన్స్ చేయగలిగే సత్తా ఉంది, ఈ మార్క్ అందుకోకపోతే మాత్రం అది నీ తప్పే అని చెప్పా’ అని హర్భజన్ పేర్కొన్నాడు. విరాట్ ఇప్పటివరకు 113 టెస్టుల్లో 8848 రన్స్ చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.