Site icon NTV Telugu

Shakib Al Hasan-Umpires: రెండుసార్లు అంపైర్లు అడిగినా.. బంగ్లా కెప్టెన్ షకిబ్ వెనక్కి తగ్గలేదు!

Shakib Al Hasan Umpires

Shakib Al Hasan Umpires

Shakib Al Hasan not withdrawing his decision after Umpires Asked Two Times: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ ‘టైమ్డ్‌ ఔట్‌’గా పెవిలియన్‌ చేరడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పలువురు క్రికెట్‌ మాజీలు అంటున్నారు. అయితే ఈ వివాదంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పీల్‌ను ఉపసంహరించుకుంటావా? అని అంపైర్లు రెండుసార్లు అడిగినా.. షకిబ్ వెనక్కి తగ్గలేదట. ఈ విషయాన్ని వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా సోమవారం ఢిల్లీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్‌ నిర్ణీత సమయం 2 నిమిషాల కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చినందుకు టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్‌.. గార్డ్‌ తీసుకోకుండా హెల్మెట్‌ కోసం ఎదురు చూశాడు. సమయం మించిపోవడంతో బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ ఔట్‌ కోసం అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు.

ఆన్-ఫీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. అప్పీల్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నారా? అని షకీబ్‌ను రెండుసార్లు అడిగారు. ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ అడిగినా షకీబ్‌ తన నిర్ణయం మార్చుకోలేదు. ఈ విషయాన్ని ఇయాన్‌ బిషప్‌ చెప్పాడు. ‘మాథ్యూస్‌ ఔట్‌ కోసం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అప్పీలు చేశాడు. అప్పీల్ వెనక్కి తీసుకుంటావా? అని అంపైర్లు రెండుసార్లు షకిబ్‌ను అడిగినా.. రెండుసార్లూ ‘లేదు.. లేదు’ అని జవాబిచ్చాడు. దాంతో నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు’ అని ఇయాన్ బిషప్‌ తెలిపాడు.

Also Read: Shakib Al Hasan: నా జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది.. మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌పై షకిబ్‌!

2007లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ‘టైమ్డ్‌ ఔట్’ కావాల్సి ఉంది. అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్ అప్పీలు చేయకుండా.. దాదా కోసం ఎదురుచూశాడు. ఈ విషయాన్ని పలువురు అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. షకిబ్‌ తీసుకున్న నిర్ణయంపై మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్, డేల్‌ స్టెయిన్‌.. ఆస్ట్రేలియా టెస్టు ప్లేయర్ ఉస్మాన్‌ ఖవాజా స్పందించారు. ఈ సంఘటన అత్యంత దారుణం అని, ఇది సరైంది కాదని వారు పేర్కొన్నారు.

Exit mobile version