బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ ఇటీవలే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అవకాశం ఉంటే.. స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతానని చెప్పాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా అమెరికాకు వెళ్ళిపోయాడు. బంగ్లాలో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. దానికి కారణం షేక్ హసీనా ప్రభుత్వమేనని ఆ యువకుడి తండ్రి కేసు పెట్టాడు. హసీనా పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన షకిబ్‌పైనా కేసు నమోదవడంతో అతడు స్వదేశానికి వెళ్లకుండా.. యూఎస్‌కి చేరాడు. కెనడాలో టీ20 లీగ్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాలో చెలరేగిన పరిస్థితులపై షకిబ్ అల్ హసన్ తొలిసారి స్పందించాడు. తాను ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్నందుకు క్షమించాలని కోరాడు. ‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులకు సంతాపం తెలియజేస్తున్నా. దేశంలో తలెత్తిన సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, క్షతగాత్రులైన వారికి సానుభూతి తెలుపుతున్నా. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధను ఏదీ తీర్చలేదు. ప్రతిఒక్కరికీ తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నేను ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండటం చాలా మందిని బాధించింది. వారిని అర్థం చేసుకోగలను. ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నా’ అని షకిబ్ బుధవారం తన అధికారిక ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Also Read: NTR vs Hrithik: ‘నాటు నాటు’కి మించి.. స్క్రీన్స్ పరిస్థితి ఏంటో?
‘దేశాభివృద్ధిలో భాగం కావాలనే రాజకీయాల్లోకి వచ్చాను. మగుర 1 నియోజకవర్గం దేశంలో ఆదర్శంగా నిలవాలని కొరుకున్నా. నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కారణం కూడా అదే. ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే పదవి వల్లే సాధ్యమవుతుందని భావించా. నన్ను బంగ్లాదేశ్ క్రికెటర్‌గానే గుర్తిస్తే చాలు. నేను ఏ స్థాయిలో ఉన్నా.. క్రికెట్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. నా చివరి మ్యాచ్ సమయంలో గొప్ప క్రికెటర్లతో కరచాలనం చేశాను. అన్ని వేళలా అండగా ఉన్న అందరికి ధన్యవాదాలు’ అని షకిబ్ పేర్కొన్నాడు.