FDA Notice: పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రకటనల ద్వారా ప్రోత్సహించడంపై ఈ చర్యలు చేపట్టింది. విమల్ అనే పాన్ మసాలా సంస్థకు చెందిన ‘ఏలకుల’ (Elaichi) ఉత్పత్తి ప్రచారం కోసం ఈ ముగ్గురు నటులు 2024లో కలిసి ఒక ప్రకటన (Ad) చేశారు. మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం చీఫ్ తుకారాం ముండే ఆగస్టు 11న ఈ తొమ్మిది పేజీల షోకాజ్ నోటీసును జారీ చేశారు. సదరు ప్రకటనల ప్రచారంలో పాల్గొనడం తక్షణమే నిలిపివేయాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ ప్రకటనకు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను వెంటనే తొలగించాలని నటులను ఆదేశించారు.
“ఈ ప్రకటనను పరిశీలించిన తర్వాత, మహారాష్ట్రలో తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై కఠిన నిషేధం ఉన్న ‘విమల్ పాన్ మసాలా’ బ్రాండ్‌ను ఇది ప్రత్యక్షంగా/పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది” అని తుకారాం ముండే పేర్కొన్నారు. ప్రకటనలో ఉపయోగించిన ‘విమల్ ఏలకులు’ అనే పదం వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని, నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ గురించిన భావనను పరోక్షంగా పెంచేలా ఉందే తప్ప ఒక స్వతంత్ర ఉత్పత్తి ప్రకటనలా కనిపించడం లేదని నోటీసులో స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యం, భద్రతా నిబంధనలను ఉల్లేఖిస్తూ రాష్ట్రంలో పాన్ మసాలాపై ఉన్న పూర్తి నిషేధ ఉత్తర్వులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారి తుకారాం ముండే.. ఆ నటులు చేసుకున్న అగ్రిమెంట్లు, ప్రచార వివరాలు, లభించిన పారితోషికం ఖాతాలు, ఈ ప్రకటన ఒప్పందానికి ముందు చేసిన ముందస్తు పరిశీలన (due diligence) ఆధారాలను కూడా సమర్పించాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం… తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటిస్తే రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానాతో పాటు సదరు నటులపై మూడేళ్ల వరకు ఎలాంటి ఉత్పత్తుల ప్రకటనల్లోనూ నటించకుండా నిషేధం విధించే అవకాశముంది.

