NTV Telugu Site icon

Bihar Road Accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి

Bihar

Bihar

Bihar Road Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి పక్కన పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు అదుపుతప్పి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 12మంది మృతిచెందారు. ఈ ప్రమాదం వైశాలీ జిల్లాలోని దేస్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా గావ్ తోలా గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. హాజీపూర్-మహ్నార్ రోడ్డు పక్క ఉన్న ఆలయంలో గ్రామస్తులు పూజలు చేస్తుండగా.. అదే సమయంలో ట్రక్కు అదుపుతప్పి వారిపై దూసుకొచ్చింది. క్షతగాత్రులను హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Tanker Accident: హైవేపై ట్యాంకర్‌ బీభత్సం.. 40కి పైగా వాహనాలు ధ్వంసం

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన 12 మందిలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ తెలిపారు. ప్రమాద ఘటనపై పీఎం నరేంద్రమోదీ స్పందించారు. ప్రమాద ఘటన తనను బాధించింది అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Show comments