Site icon NTV Telugu

Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్‌లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..

Sensex Crash

Sensex Crash

Sensex Crash: శుక్రవారం మధ్యాహ్నం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:33 గంటల సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు నష్టపోయి 76,653 వద్ద ఉండగా, నిఫ్టీ 283 పాయింట్లు క్షీణించి 23,890 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు $106 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధాన ఐటీ సంస్థలు బలహీనమైన గైడెన్స్‌ను ప్రకటించడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పతనమై మార్కెట్‌ను భారీగా దెబ్బతీసింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIలు) వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే రూ.3,200 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ (India VIX) 4 శాతం పెరిగి 19.3 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనం.

లాభనష్టాల్లోని షేర్లు..
ఈ రోజు మార్కెట్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 6 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎం అండ్ ఎం షేర్లు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా నామమాత్రపు మద్దతును అందించింది. మార్కెట్లో విక్రయాల ఒత్తిడి ఎంత బలంగా ఉందంటే.. దాదాపు 2,752 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కేవలం 965 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి 23,800 స్థాయి వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version