Site icon NTV Telugu

Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలనున్న స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

Asia Markets Crash

Asia Markets Crash

Sensex Crash: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆర్థిక మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై పిడుగులా పడింది. ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై సైనిక దిగ్బంధనాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి.

READ ALSO: Mangli: సింగర్ మంగ్లీపై రూ.10 కోట్ల మోసం కేసు.. అసలు నిజం ఏమిటి?

గిఫ్ట్ నిఫ్టీలో పతనం.. ఆసియా మార్కెట్ల అతలాకుతలం
భారత మార్కెట్ల గమనాన్ని సూచించే గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) ఉదయాన్నే 300 పాయింట్లు (1.34%) పతనమై 23,768 వద్ద ట్రేడవుతోంది. కీలకమైన 24,000 మార్కును నిఫ్టీ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. జపాన్ నిక్కీ 0.8% నష్టపోయింది. అలాగే హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1% పడిపోయింది. సింగపూర్, మలేషియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే చైనా మార్కెట్లు మాత్రం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ స్వల్ప లాభాల్లో ఉండటం గమనార్హం.

11 శాతం పెరిగిన ముడి చమురు ధరలు
ప్రపంచ చమురు రవాణాలో 20 శాతానికి పైగా వాటా ఉన్న హోర్ముజ్ జలసంధి మూతపడుతుందన్న వార్తతో చమురు మార్కెట్ భగ్గుమంది. ముడి చమురు ధరలు ఏకంగా 11 శాతం పెరిగి, బ్యారెల్‌కు 105 డాలర్లను దాటాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ $104.25 వద్ద, బ్రెంట్ క్రూడ్ $101 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్, లైవ్‌లాంగ్ వెల్త్ వ్యవస్థాపకుడు హరిప్రసాద్ కె అభిప్రాయం ప్రకారం.. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల (FII) నిధుల ఉపసంహరణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను రిస్క్-ఆఫ్ మోడ్‌లోకి నెట్టాయన్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన 8 నిమిషాల్లోనే మదుపరులు సుమారుగా రూ.8 లక్షల కోట్లు సంపదను కోల్పోయారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతుంది.

READ ALSO: IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!

Exit mobile version