NTV Telugu Site icon

MLC Kavitha: లిక్కర్ కేసులో బాధితురాలిని.. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

Kavitha Letter

Kavitha Letter

MLC Kavitha: తనకు లిక్కర్‌ కేసులో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నాలుగు పేజీలతో మీడియాకు లేఖ విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని.. లిక్కర్‌ కేసులో తాను బాధితురాలినని లేఖలో తెలిపారు. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదన్నారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ రెండున్నర ఏళ్లుగా జరిగిందని.. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆమె లేఖలో స్పష్టం చేశారు. తన మొబైల్ నెంబర్‌ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి ప్రైవసీని దెబ్బతీశారన్నారు.

Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యానని.. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానన్నారు. దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశానని.. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత లేఖలో రాశారు. గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారని.. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని.. చాలామందిని అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు అరెస్టు చేశారన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం..

కవిత లేఖలో.. ” రెండున్నర ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పినా, నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులు అన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి “నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతాం” అన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను” అని లేఖలో అభ్యర్థించారు.