గద్వాల నవ వరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్‌ని వివాహం చేసుకుంది.
Also Read:San Rechal: ప్రముఖ మోడల్ శాన్ రీచల్ ఆత్మహత్య
పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య, తిరుమలరావు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ ఛేంజర్ డివైజ్ సాయంతో మహిళ గొంతులో ప్రియురాలు ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. ఈ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. తేజేశ్వర్ కు విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదం అని అతడిని చంపాలని ప్రియుడు తిరుమల రావును ప్రేరేపించింది. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకుని జూన్ 13న గద్వాలలోని సంగాల చెర్వు వద్దకు రావాలంటూ తేజేశ్వర్‌కు గ్యాంగ్ ఫోన్ చేయగా.. అతను తన స్నేహితుడితో కలిసి రావడంతో హత్య పన్నాగం విఫలమైంది.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సన్నివేశం తొలగించడమేంటీ..? సెన్సార్‌పై శ్రీయ బోల్డ్ కౌంటర్
మళ్లీ 17న డ్రైవర్ నాగేష్, పరుశరాము, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేజేశ్వర్‌ని కారులో తీసుకెళ్లారు. కారులోనే అతన్ని వేట కొడవళ్లు, కత్తులతో గొంతు కోసి కడతేర్చారు. ‘అన్నా.. నన్నెందుకు చంపుతున్నారు’ అని తేజేశ్వర్ గ్యాంగ్‌ను అడిగినట్లు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. వేడుకున్నా వదలకుండా హత్య చేసినట్లు తెలిపారు. తేజేశ్వర్ హత్య నిందితులు మహబూబ్ నగర్ జిల్లా జైలు లో ఉన్నారు. ఇవాళ తేజేశ్వర్, ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీస్ లు పిటిషన్ వేయనున్నారు.
