Municipal Chairperson: హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా హిందూపురం పట్టణంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నట్లు హిందూపురం పోలీసులు ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతి ఉంది. మిగతా వారెవరూ హాల్‌లోకి వెళ్లరాదు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ప్రజలు గుంపులుగా కూడకూడదని పోలీసులు హెచ్చరించారు. అత్యంత కీలకమైన ఈ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: Thandel : వాళ్లిదరు లేకుండా నెక్ట్స్ సినిమా చేయలేనేమో అని భయం పట్టుకుంది : నాగ చైతన్య
ఎన్నికల ఫలితాల అనంతరం విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, డీజేలు, బాణాసంచా వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు ప్రకటించిన నియమాలను అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తప్పక పాటించాలని కోరారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉందని హిందూపురం పోలీసులు వెల్లడించారు. హిందూపురం పట్టణంలో ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 24 గంటలపాటు నిఘా ఉంచనున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు కృషి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.