రక్షణ దళాల కోసం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జూలై 15న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రక్షణ దళాల్లో నియామకం కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరపాలని కోరుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దరఖాస్తును కూడా దాఖలు చేసింది. అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. సాయుధ దళాల కోసం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను పునఃపరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది హర్ష్ అజయ్ సింగ్ పిల్ దాఖలు చేశారు.
ఈ పథకాన్ని ప్రకటించడంతో బిహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ అనేక ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడు పిటిషన్లలో దేనికి సంబంధించి కేంద్రం కేవియట్ దాఖలు చేసిందో మాత్రం వెల్లడించలేదు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఇటీవల అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. పలు అంశాలను ప్రస్తావించారు. వందల ఏళ్ల నుంచి ఉన్న ఎంపిక విధానాన్ని ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు. దీంతోపాటు ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ అనుమతి లేదని పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకం కోసం కేంద్రం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ కూడా పిల్ దాఖలు చేశారు.
Telangana Extend Holidays: విద్యా సంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగింపు
జాతీయ భద్రతపై అగ్నిపథ్ పథకం ప్రభావాన్ని విశ్లేషించేందుకు ఒక కమిటీని వేయాలని గత వారం విశాల్ తివారీ అనే మరో న్యాయవాది పిటిషన్ వేశారు. దీంతోపాటు అగ్నిపథ్ ప్రకటన తర్వాత చెలరేగిన హింసపై విచారణ నిర్వహించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కేంద్ర మంత్రివర్గం జూన్ 14న అగ్నిపథ్ అనే పథకాన్ని త్రివిధ దళాల్లో నియామకం కోసం ఈ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ఆమోదించింది. ఈ పథకం కింద ఎంపికైన యువకులను అగ్నివీర్స్ అని పిలుస్తారు. అగ్నిపథ్ ద్వారా దేశభక్తి కలిగిన యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాల్లో పనిచేసేందుకు నియామకాలు చేపట్టనున్నారు.