NTV Telugu Site icon

SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ

Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga About Supreme Court’s SC/ST Sub-Classification Verdict: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పానన్నారు. అధర్మమే తాతాక్కలిమైనా.. చివరకు ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పా అని మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…. ‘వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. మా 30 ఏళ్ల అలుపెరగని పోరాటానికి విజయం లభించింది. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించాం. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడాం. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడ్డ వారందరికి ఈ విజయం అంకితం’ అని అన్నారు.

Also Read: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా

‘ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకున్నారు. మొదట వర్గీకరణ చేసింది మాత్రం సీఎం చంద్రబాబు గారే. ఇప్పుడు తీర్పు వచ్చినప్పుడు సీఎంగా ఉంది చంద్రబాబే. చంద్రబాబు స్థానంలో వేరొకరు ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పా. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తాం. సహకరించిన వారికి కృతజ్ఞతలు’ అని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

 

Show comments