ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండటం సర్వసాధారణం అయిపోయింది. రోజువారీ డిజిటల్ లావాదేవీలు, సొంత పొదుపులు లేదా అత్యవసర అవసరాల కోసం అందరూ సేవింగ్స్ ఖాతాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే.. తమ ఖాతాలో ఒక నెలకు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఎంత నగదు జమ చేయవచ్చనే బ్యాంకింగ్, ఆదాయపు పన్ను నిబంధనలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు.
నిబంధనలకు మించి ఖాతాలో నగదు జమ చేసినప్పుడు లేదా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకులు ఆ వివరాలను పన్ను శాఖకు నివేదిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. దీని వల్ల పన్ను నోటీసులు, అదనపు జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖాతాదారులు ఈ డిపాజిట్ పరిమితులు, చట్టపరమైన వివరాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యం.
సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసినట్లయితే, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. ఈ పరిమితి దాటితే పన్ను విచారణ జరిగే అవకాశం ఉన్నందున, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ (ITR) రిటర్నులలో ఆ సొమ్ముకు సంబంధించిన సరైన ఆదాయ వనరును (జీతం, వ్యాపార లాభాలు, ఆస్తి అమ్మకం వివరాలు) స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. వ్యాపార లేదా చట్టబద్ధమైన పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అయితే దానికి తగిన నిబంధనల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
అయితే ఆదాయ వనరును సరిగ్గా నిరూపించలేకపోతే పన్ను శాఖ నుంచి పెనాల్టీలు, భారీ పన్నులు విధించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ జమ చేయడానికి పాన్ కార్డ్ (PAN) లేదా ఫారమ్ 60 సమర్పించడం తప్పనిసరి. అదేవిధంగా.. సెక్షన్ 269ST కింద ఒకే రోజులో ఒకే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు స్వీకరించడం చట్టవిరుద్ధం, దీనికి నిబంధనలు ఉల్లంఘిస్తే 100 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్లు, డిపాజిట్ రశీదులు సరిగ్గా భద్రపరుచుకోవడం అవసరం.

