Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌ అరెస్ట్..

Saurav Gurjar

Saurav Gurjar

Saurav Gurjar: మహాభారతం సీరియల్ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుజ్జార్‌తో పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వాట్సాప్ వేదికగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. 2021 డిసెంబర్ 25న వారు తొలిసారి కలుసుకున్న సమయంలో భార్యతో సమానంగా చూసుకుంటానని అతడు హామీ ఇచ్చాడని బాధితురాలు పేర్కొంది. తామిద్దరం అమెరికాలో ఉన్నప్పుడే కాకుండా, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా కలిసి జీవించామని వెల్లడించింది.

అంతేకాకుండా కలిసి వ్యాపారం చేద్దామని సౌరవ్ నమ్మించడంతో తాను అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపుల కారణంగా ఉద్యోగంపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని, పెళ్లి గురించి నిలదీసినప్పుడల్లా తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేస్తూ దూరమయ్యేవాడని ఆరోపించింది. 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు తనతోనే ఉన్న సౌరవ్, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇద్దరం కలిసి ఉంటుండగా ఉన్నట్టుండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాయమయ్యాడని ఫిర్యాదులో తెలిపింది. యువతి ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్‌పోర్టులో రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించేందుకు గచ్చిబౌలి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.