Saudi Arabia: ఈ ముస్లిం దేశం శిరచ్ఛేదం(మరణశిక్ష) అమలులో నయా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. AFP లెక్కల ప్రకారం.. ఈ దేశం ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలో అత్యధికంగా విధించిన మరణశిక్ష సంఖ్య. 2024లో ఈ సంఖ్య 338 మందిగా ఉండేది. తాజా లెక్కలతో ఈ దేశం తన రికార్డును తానే అధిగమించినట్లు అయ్యింది.
READ ALSO: Shivaji: ‘దండోరా’లో నా పాత్ర మిస్టరీ.. ఇది పక్కా కమర్షియల్
సోమవారం మక్కాలో హత్య కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించిన తర్వాత తాజా సంఖ్య బయటికి వచ్చింది. నిజానికి సౌదీ అరేబియా తన సొంత రికార్డును బద్దలు కొట్టడం ఇది వరుసగా రెండవ సంవత్సరంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అమలు చేసిన మరణశిక్షలలో 232 మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించినవిగా సౌదీ అధికారులు తెలిపారు. మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టం ప్రకారం మరణశిక్షను ఉద్దేశపూర్వక హత్య వంటి “అత్యంత తీవ్రమైన నేరాలకు” పరిమితం చేయాలని చెబుతున్నాయి, కానీ సౌదీ అరేబియా మాత్రం ఈ నిబంధనలు నిరంతరం ఉల్లంఘిస్తోందని అన్నారు. అలాగే ఈ దేశంలో అనేక మందిని ఉగ్రవాద ఆరోపణలపై ఉరితీశారని చెప్పారు.
మైనర్లను కూడా వదిలిపెట్టలేదు..
మానవ హక్కుల సంఘాలు తెలియజేసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఇటీవలి నెలల్లో ఈ దేశంలో నేరాలు జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా మరణశిక్ష విధించారు. నిజానికి ఇది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సులో సౌదీ అరేబియా సంతకం చేసిన నిబంధనకు ప్రత్యక్ష ఉల్లంఘనగా చెబుతున్నారు. 2020లో అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత, సౌదీ ప్రభుత్వం మైనర్లకు ఉరిశిక్ష విధించబోమని పేర్కొంది. కానీ సౌదీ తన మాటమీద నిలబడకుండా అలాంటి ఉరిశిక్షలను కొనసాగిస్తూనే ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేసే దేశాలు ఇవే..
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం.. 2022, 2023, 2024 సంవత్సరాల్లో చైనా, ఇరాన్ తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు అమలు చేసిన మూడవ దేశం సౌదీ అరేబియా. 2025 నాటి డేటా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Ravi Teja – Vashishta: వశిష్ట దర్శకత్వంలో మాస్ మహారాజా కొత్త సినిమా
