లెజెండరీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ వృత్తిరీత్యా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు మనవ సంబంధాల నిర్వచనాన్ని ప్రశ్నిస్తున్నాయి.
దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ తనకు పెళ్లి అనే వ్యవస్థపై గౌరవం ఉన్నా, వ్యక్తిగతంగా నమ్మకం లేదని స్పష్టం చేశారు.. ‘తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్ల బంధం బలపడుతుందని నేను అనుకోను. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండవచ్చు, దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. అన్నిటికంటే ఎక్కువగా చర్చకు దారితీసిన అంశం పిల్లల గురించి ఆమె చెప్పిన మాటలు.. ‘పిల్లలను కనాలంటే పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను నేను ఒప్పుకోను. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఆమె కుండబద్దలు కొట్టారు.
మహిళకు తన శరీరంపై, తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుందని ఆమె ఈ సందర్భంగా చాటిచెప్పారు. తన తండ్రి సత్యరాజ్ నాస్తికుడు కావడంతో, తనకు జాతకం కూడా రాయించలేదని ఆమె వెల్లడించారు.. ‘నాకు జాతకం లేదు, ఆ విషయంపై నాకు గర్వంగా ఉంది. గ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయని నేను నమ్మను. నాన్న నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా, ఒంటరిగా ఉన్నా.. నేను సంతోషంగా ఉండటమే ఆయనకు ముఖ్యం” అని చెబుతూ తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
