Site icon NTV Telugu

Sankranti Rush: అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్‌..

Sankranti Rush

Sankranti Rush

Sankranti Rush: సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి.

సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే కొన్ని సీట్లు అందుబాటులో ఉండగా, 17, 18, 19 తేదీల్లో తిరిగి పూర్తి హౌస్‌ఫుల్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో స్పెషల్ రైళ్లను నడిపితే మాత్రమే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఆర్టీసీ బస్సుల్లో క్రేజ్
రైళ్ల పరిస్థితికి భిన్నంగా లేకుండా, ఆర్టీసీ బస్సుల్లో కూడా భారీగా రిజర్వేషన్లు జరిగిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల్లో అన్ని సీట్లు బుక్ అయిపోయాయి. ఏసీ బస్సుల్లో సీట్లు ఒక్కటీ అందుబాటులో లేవు. నాన్-ఏసీ బస్సుల్లో కూడా 30% మేర రిజర్వేషన్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఇవి కూడా పూర్తిగా బుక్ అయ్యే అవకాశం ఉంది.

1,400 స్పెషల్ బస్సులు సిద్ధం
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఈసారి రికార్డు స్థాయిలో 1,400 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. గత సంవత్సరం నడపిన 1,300 స్పెషల్స్‌ కంటే ఇది 100 బస్సులు ఎక్కువ.

విమాన ప్రయాణాల హల్చల్
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్న టెకీలు ఇప్పటికే రెండు నెలల ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో సంక్రాంతి సీజన్‌లో విమాన ప్రయాణాలకూ భారీ డిమాండ్ నెలకొంది.

ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్న ప్రజలు
రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న అనేక మంది చివరికి ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈసారి హైదరాబాద్ నుంచి విజయవాడ దిశగా పెద్ద మొత్తంలో క్యాబ్లు, ట్యాక్సీలు రద్దీగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో క్యాబ్లు కూడా దొరకకపోవడంతో కొందరు నేరుగా తమ సొంత ఊర్లకు ఫోన్ చేసి, విజయవాడ నుంచి వాహనాలు పంపించమని అడుగుతున్న పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version