సంక్రాంతి పండగ వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకపక్క పోలీసుల దాడులు కొనసాగుతున్నా.. మరొక పందెం నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 150కి పైగా పందెం బరుల్లో పుంజుల కొట్లాటలు చూసేందుకు లక్షల సంఖ్యలో జనం తరలి రానున్నారు.
మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సైతం భారీ బరులు సిద్ధం చేశారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి, పిట్టలవానిపాలెం, నగరం, చీరాల, వేటపాలెం మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిట్టలవానిపాలెం మండలంలోని ఓ బరిలో పందెం కోడిని దింపడానికి ముందుగా నిర్వాహకుల వద్ద పేరు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ఒక్కో పందెం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. వరుసగా మూడు పందేల్లో పుంజు నెగ్గితే.. యజమానికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇస్తారట. కోడి పందాలు రేపు ఉదయం నుంచే మొదలు కానున్నాయి. ఎంతోమంది పందెం రాయుళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు.