Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు..

Sanju Samson

Sanju Samson

Sanju Samson UPSC Scholarship: టీమిండియా క్రికెటర్ సంజు శామ్సన్ మైదానంలోనే కాదు, సమాజ సేవలోనూ తన ఉదారతను చాటుకుంటున్నాడు. సివిల్ సర్వీసెస్ సాధించాలనే పట్టుదల ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల వల్ల వెనకబడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆసరాగా నిలిచేందుకు ఓ గొప్ప సంకల్పంతో ముందుకొచ్చాడు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న 1,000 మంది విద్యార్థులకు సాయం చేసేందుకు స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించాడు. ‘లీడ్ ఇండియా సమ్మిట్’ వేదికగా సంజు శామ్సన్ ఫౌండేషన్, లీడ్ ఐఏఎస్ అకాడెమీ (Lead IAS Academy)ల భాగస్వామ్యంతో ఈ సామాజిక చొరవను ప్రారంభించాడు. నాణ్యమైన కోచింగ్ లేక ఏ ఒక్క ప్రతిభావంతుడి కల ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల శిక్షణ మాత్రమే కాకుండా వ్యక్తిగత మార్గదర్శకత్వం (Mentorship), ప్రత్యేక నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఇందులో భాగంగా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి (Critical Thinking), నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తారు. ఈ ప్రాజెక్టులో మరో విశేషమేమిటంటే.. శామ్సన్ సొంత ఊరైన విజింజం (Vizhinjam) తో పాటు దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ ఉన్న పేద, ప్రతిభావంతులైన యూత్ సివిల్స్‌ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించనున్నారు. ఈ సందర్భంగా సంజు శామ్సన్ మాట్లాడుతూ.. క్రికెట్‌లో తాను సాధించిన విజయం వెనుక ఏ విధంగా ఐతే ప్రతిభ, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, పట్టుదల ఉన్నాయో.. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్న యువతకు కూడా అవే అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. క్రీడల్లో తనకు లభించిన అవకాశాల్లాగే, దేశసేవ చేయాలనుకునే యువతకు కూడా తగిన అవకాశాలు కల్పించాలనేదే తన ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించాడు.

ఇక, సంజు ఫౌండేషన్‌తో చేతులు కలిపిన ‘లీడ్ ఐఏఎస్ అకాడెమీ’కి మాజీ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం లభిస్తోంది. కేరళ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ (IPS), సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ (IPS), కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మాజీ కార్యదర్శి అనిల్ స్వరూప్ (IAS), మాజీ రాయబారి టి.పి. శ్రీనివాసన్ (IFS) వంటి ప్రముఖుల పర్యవేక్షణలో విద్యార్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదంతా యూపీఎస్సీ అభ్యర్థులకు ఒక క్రమబద్ధమైన, అత్యున్నత స్థాయి అభ్యాస వాతావరణాన్ని అందిస్తుంది. దీంతోపాటు, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సివిల్స్ పట్ల అవగాహన పెంచేందుకు ‘లీడ్ ఐఏఎస్ జూనియర్’ అనే ప్రోగ్రామ్‌ను కూడా జోడించారు. చిన్నతనం నుంచే పబ్లిక్ స్పీకింగ్, సమకాలీన అంశాలపై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, నైతిక విలువలను అలవాటు చేయడం ద్వారా భవిష్యత్తులో వారు ఎలాంటి పోటీ పరీక్షలనైనా సులువుగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. మొత్తం 1,000 మందికి లభించే ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను అధిగమించి, విభిన్న నేపథ్యాలు ఉన్న ఎంతోమంది ఆశావాదులు తమ ఐఏఎస్, ఐపీఎస్ కలలను నెరవేర్చుకోవడమే కాకుండా, దేశ సేవలో భాగస్వాములు కానున్నారు.