Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య

Surekha

Surekha

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రియుడి మోజులో పడి కన్నతల్లిదండ్రులనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దారుణంగా హత్య చేసిన యువతి సురేఖ, జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ, ఓ యువకుడిని ప్రేమించింది. తమ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో వారిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలోని తన ఇంట్లో తల్లిదండ్రులకు మత్తుమందు కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి వారి ప్రాణాలు తీసింది. అనంతరం వారు అనారోగ్యంతోనే మృతి చెందినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే విచారణలో అసలు నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇటీవలే ఈ కేసులో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సురేఖ, తిరిగి సంగారెడ్డికి వచ్చి శాంతినగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. శనివారం రాత్రి తన తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్న ఆ మత్తు ఇంజెక్షన్‌నే తాను కూడా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. “నా చావుకు ఎవరూ కారణం కాదు” అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేఖ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే, కన్నవారిని దారుణంగా హత్య చేసిన సురేఖ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు, స్వగ్రామానికి రప్పించేందుకు ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా నిరాకరిస్తున్నారు. యువతి మృతి చెందినా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యులను ఒప్పించి సంగారెడ్డికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.