NTV Telugu Site icon

Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్‌ రిక్వెస్ట్‌!

Vishal Meshram

Vishal Meshram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రాకతో థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో కొందరు ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం బన్నీ దృష్టికి రాగా.. ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా స్పందించారు.

సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అల్లు అర్జున్‌ తన ఫాన్స్‌కు సూచించారు. ‘నా ఫాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యాన్స్‌ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్‌ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడుతాయి. నెగెటివ్‌ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫాన్స్‌కు సూచిస్తున్నా’ అని ఐకాన్ స్టార్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అర్జున్‌ అరెస్టు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం మాట్లాడారు. ఒక్కరోజు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హీరో ఇంటి దగ్గర క్యూ కట్టి మరీ.. ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. కొందరు అడ్డగోలుగా పోస్టులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం మండిపడ్డారు. దాంతో అల్లు అర్జున్ తన అభిమానులకు రిక్వెస్ట్‌ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.