Damodar Raja Narasimha: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోమి సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ (Tertiary Integrated Medical Services -TIMS) హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. సనత్‌నగర్ హాస్పిటల్ ఏర్పాట్ల పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కొన్ని ఎలక్ట్రికల్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ విభాగాలు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటికే అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్ పూర్తయిందని వెల్లడించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మాది ప్రచార ఆర్భాటం కాదు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం” అని అన్నారు. అన్నిరకాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్‌లో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడే అవసరమైన రీసెర్చ్ కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!
అదేవిధంగా అత్యాధునిక ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను కూడా ఈ హాస్పిటల్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేలా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. గత రెండేళ్లలోనే సుమారు 10 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
