స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ కెపాసిటీ కీలకంగా చూస్తుంటారు. దాదాపు యూజర్లందరు గంటలు గంటలు ఫోన్ యూజ్ చేస్తుంటారు. అందుకే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 5000mAh బ్యాటరీ, 10000mAh వరకు బ్యాటరీలతో ఫోన్‌లను విడుదల చేశాయి. 7000mAh, అంతకంటే పెద్ద బ్యాటరీలు ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. అయితే, ఈ అభివృద్ధి అంతా చైనీస్ బ్రాండ్లలో కనిపించింది. ప్రస్తుతం సామ్ సంగ్, ఆపిల్ ఈ ధోరణికి దూరంగా ఉన్నాయి. అనేక చైనీస్ కంపెనీలు సిలికాన్-కార్బన్ టెక్నాలజీ ఆధారంగా పెద్ద బ్యాటరీలను తమ స్మార్ట్‌ఫోన్‌లలో చేర్చాయి. ఇప్పుడు, సామ్ సంగ్ కూడా కొత్త బ్యాటరీ టెక్నాలజీలతో ప్రయోగాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నివేదికల ప్రకారం, సామ్ సంగ్ 20,000mAh బ్యాటరీపై పనిచేస్తోందని తెలుస్తోంది. అయితే, ఈ బ్యాటరీ ఏ ఫోన్‌లో అమర్చుతారనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. సామ్ సంగ్ పరీక్షిస్తున్న బ్యాటరీ డ్యూయల్-సెల్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ బ్యాటరీ సిలికాన్-కార్బన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. రెండు వేర్వేరు బ్యాటరీ సైజులను కలపడం ద్వారా సామ్ సంగ్ దీనిని సృష్టించింది. 12,000mAh బ్యాటరీ 6.3mm ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఉంచారు. అయితే 8,000mAh బ్యాటరీ 4mm మందంగా ఉంటుంది. ఈ రెండు కలిపిన బ్యాటరీ 20,000mAh బ్యాటరీని సృష్టిస్తుంది. అయితే, ఈ బ్యాటరీ పరీక్ష దశలో ఆకట్టుకునే ఫలితాలను ఇవ్వలేదు.
టిప్‌స్టర్ ప్రకారం, ఈ 20,000mAh బ్యాటరీ 27 గంటల స్క్రీన్-ఆన్ సమయాన్ని అందిస్తుంది. ఈ బ్యాటరీ సంవత్సరానికి 960 ఛార్జ్ సైకిల్స్‌ను తట్టుకోగలదు. సమస్య బ్యాటరీ లైఫ్ లో ఉంది. పరీక్షలో చాలా తక్కువ బ్యాటరీ లైఫ్ ఉందని, అది త్వరగా ఉబ్బుతుందని తేలింది. పరీక్ష సమయంలో, 4mm మందం ఉన్న 8000mAh బ్యాటరీ 7.2mm కు పెరిగింది. ఈ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించడానికి తగినది కాదు. అయితే, దీనికి సంబంధించి సామ్ సంగ్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.
