అసెంబ్లీ సమావేశాలు గానీ.. పార్లమెంట్ సమావేశాలు గానీ ఎలా జరుగుతాయో ప్రజలందరికీ తెలిసిందే. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఐదేళ్లకోసారి అటు వైపు వాళ్లు.. ఇటు వైపు… ఇటు వైపు వాళ్లు.. అటు వైపు వెళ్లడం జరగుతుంటుంది. ఇంకొందరైతే మళ్లీ సభకు రాకపోవచ్చు. ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాజ్యసభలో (Rajya Sabha) కొంత మంది ఈ వారం మాజీలు కాబోతున్నారు. ఈ సందర్భంగా సభలో ఎంపీలు వీడ్కోలు ప్రసంగం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీగా ఉన్న ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) కూడా రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. తనకు కోపం ఎక్కువని.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. అయినా తనకు ఎవరినీ గాయపరిచే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విసుర్లు విసిరిన సంగతి తెలిసిందే.
తనకు ఎందుకు కోపం వస్తుందని ప్రజలు అడుగుతుంటారని.. ఏం చెప్పమంటారు.. స్వభావమే అలాంటిది అని చెప్పుకొచ్చారు. ఏదైనా నచ్చనప్పుడు సహనం కోల్పోతానని తెలిపారు. సభలో అలా ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే క్షమించాలని జయా బచ్చన్ కోరారు.
రాజ్యసభ చైర్మన్ థన్‌ఖఢ్ గత మంగళవారం నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నను విడిచిపెట్టి మరో ప్రశ్నను ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ నేత ఒకరు నిలదీశారు. దీనిపై ధన్‌ఖఢ్ ఆయనను మందలించారు. దీంతో జయాబచ్చన్ జోక్యం చేసుకుంటూ… ఎందుకు అలా జరిగిందో చెబితే సభ్యులు అర్ధం చేసుకుంటారని.. వాళ్లేమీ చిన్నపిల్లలు కాదని ధన్‌ఖఢ్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తర్వాత కొద్దిసేపటికే వ్యవహారం చక్కబడింది.
