NTV Telugu Site icon

Sai Praneeth Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్!

Pawan Kalyan (3)

Pawan Kalyan (3)

Sai Praneeth announces retirement from badminton: భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. గత కొణతకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్‌కు సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు.

‘డియర్‌ బ్యాడ్మింటన్‌ థాంక్యూ. బ్యాడ్మింటన్‌తో 24 ఏళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ.. రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్‌లో కొత్త చాప్టర్‌ మొదలుపెడుతున్నా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను. అభిమానుల అపూర్వ మద్దతు నా గొప్ప బలం. భారత జెండా ఎగిరినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. బ్యాడ్మింటన్‌ ఆటపై నాది తొలి ప్రేమ. నేను గుర్తింపులోకి వచ్చింది ఈ ఆట ద్వారా మాత్రమే. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో అడ్డంకులను అధిగమించాను. అవి నా హృదయంలో పదిలంగా ఉంటాయి. నా తల్లిదండ్రులు, భార్య శ్వేత కెరీర్‌ ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. గోపీచంద్‌ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. ప్లేయర్‌గా గాకుండా కోచ్‌గా, మెంటార్‌గా ఏదో ఒక రూపంలో ఆటలో భాగమవుతా’ అని సాయి ప్రణీత్ పేర్కొన్నాడు.

2017లో సింగపూర్‌ ఓపెన్‌ గెలిచిన సాయి ప్రణీత్.. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో నిలువడంతో ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఆడిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో మెయిన్‌ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. అప్పటినుంచి గాయాల పాలవుతున్న ప్రణీత్‌.. పూర్తి స్థాయిలో ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమవుతూ వచ్చాడు. ఓవైపు యువ షట్లర్లతో పోటీ, ఫిట్‌నెస్‌ సమస్యలు అతడి కెరీర్‌కు ప్రతిబంధకంగా మారాయి.

Also Read: Ae Watan Mere Watan : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న సారా అలీ ఖాన్ మూవీ..

సాయి ప్రణీత్‌ తన కెరీర్‌లో సింగపూర్‌ ఓపెన్‌, కెనడా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిళ్లను సాధించాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్‌ తన కెరీర్‌ మొత్తంలో 225 విజయాలు సాధించగా.. 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్నాడు. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు.