Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!

Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar: నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెలన్నర రోజులుగా విద్యార్థులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి లోకం గళమెత్తుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ నిరసనలపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా నిలుస్తూ, ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తన తండ్రి, ఆచార్యుడైన రమేష్ టెండూల్కర్ చిన్నతనంలో చెప్పిన పాఠాలను గుర్తుచేసుకున్నారు. “ఓటమి ఎదురైనా పర్వాలేదు కానీ, మోసం చేయడం నేరం. జీవితంలో ఎప్పుడూ కుంటిదారులు తొక్కవద్దు” అని తన తండ్రి నూరిపోసిన విలువలను సచిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. శ్రమ కంటే ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం ప్రతిభను పక్కనపెట్టి అడ్డదారులను వెతుక్కుంటుందని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక వారు తీవ్ర నిరాశకు గురవడం సమంజసమేనని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సమాజంగా మనమంతా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘యువ భారత్’ కలలు, శక్తి సామర్థ్యాలే దేశ పురోగతికి ఇంధనమని కొనియాడిన సచిన్.. కష్టానికి తగిన ప్రతిఫలం, నేరుగా నిలబడే ప్రాతిపదిక, నిజాయితీ గెలిచే వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, సమాజంపై ఉందన్నారు. మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గాంధీ స్మృతిని సందర్శించి, విద్యార్థుల డిమాండ్‌కు మద్దతుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. అలాగే, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అంగీకరించాలని కోరారు.