NTV Telugu Site icon

Sachin Tendulkar: సూర్యకుమార్‌లా అమ్మాయి బ్యాటింగ్..సచిన్, జైషా ప్రశంసలు

8

8

విమెన్స్ ఐపీఎల్‌కు సంబంధించిన ప్లేయర్ల వేలం సోమవారం విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు ఈ లీగ్‌ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపగా ఫ్రాంచైజీలు అదే జోరుతో వేలంలో పాల్గొన్నాయి. కనీవిరీఎరుగని రీతిలో కాసుల వర్షం కురిపిస్తూ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఫ్యాన్స్ నుంచీ ఈ వేలానికి మంచి స్పందన లభించింది. ఇక ఇదే రీతిలో మ్యాచ్‌లు కూడా జరిగితే మహిళా క్రికెట్‌ మరో స్థాయికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భవిష్యత్‌లో క్రికెట్ బాట పట్టాలనుకున్న అమ్మాయిలకు ఇది ఎంతో ఊతమిస్తుంది. ఇదిలా ఉండగా రాజస్తాన్‌కు చెందిన ఓ అమ్మాయికి సంబంధించిన బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Cheteshwar Pujara: అరుదైన రికార్డుకు చేరువలో పుజారా.. రెండో టెస్టు ఆడితే!

అయితే విమెన్స్ ఐపీఎల్ వేలం జరిగిన మరుసటి రోజే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడం విశేషం. ఇందులో ఓ బాలిక బ్యాటింగ్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో ఆమె ప్రతి బంతినీ పర్ఫెక్ట్ టైమింగ్‌తో సిక్సర్లుగా మలుస్తూ కనిపించింది. ఈ వీడియో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌నే ఆకర్షించింది. దీంతో ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ సచిన్ మంగళవారం ఈ వీడియోను ట్వీట్ చేశాడు.

“నిన్ననే వేలం జరిగింది. ఈ రోజే మ్యాచ్ మొదలైందా? క్యా బాత్ హై. నీ బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాను” అనే క్యాప్షన్‌తో సచిన్ ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సచిన్ ట్వీట్ చేసిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ బాలికను స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోల్చుతున్నారు. అతనిలాగే ఈ బాలిక కూడా 360 డిగ్రీలలో షాట్లు ఆడుతూ కనిపించింది. సచిన్‌తో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఈ వీడియోను మెచ్చుకుంటూ పోస్ట్ చేయడం గమనార్హం.