Site icon NTV Telugu

Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?

Sachin Ec

Sachin Ec

బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పదవీకాలం ముగిసింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి వయోపరిమితి ఉంది. బిన్నీ వయసు 70 ఏళ్లు కావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన పదవీకాలం ముగిసింది. బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన ధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీసీసీఐ కూడా ఆసక్తి చూపుతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై సచిన్ టెండూల్కర్ నిర్వహణ సంస్థ ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్పందించింది. ‘బీసీసీఐ అధ్యక్ష పదవికి సచిన్ టెండూల్కర్‌ను పరిశీలిస్తున్నట్లు, నామినేట్ చేస్తున్నట్లు కొన్ని ప్రచారాలు మా దృష్టికి వచ్చాయి. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. బీసీసీఐ పదవిపై సచిన్‌కు ఆసక్తి లేదు. ఇది మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ఈ నిరాధారమైన ఊహాగానాలను పట్టించుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాము’ అని ఎస్ఆర్‌టీ సంస్థ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనతో అన్ని వార్తలు చెక్ పెట్టినట్లైంది. తనకు ఎలాంటి పదవిపై ఆసక్తి లేదని సచిన్ ఎప్పటినుంచో చెబుతున్నారు. తనకు ఆసక్తి ఉన్నట్లు ఎప్పుడూ కూడా చెప్పలేదు.

Also Read: Asia Cup 2025: పాకిస్థాన్‌పై విజయం పక్కా.. భారత్ అదృష్టం దుబాయ్ చేరుకుంది!

సెప్టెంబర్ 28న జరిగే ఏజీఎంలో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్‌ను కూడా నియమిస్తారు. ఐసీసీలో భారత ప్రతినిధిని కూడా ఈ సమావేశంలోనే ఎంపిక చేస్తారు. ప్రస్తుతం బీసీసీఐ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 200 టెస్ట్‌లు, 463 వన్డేలు, ఒక్క టీ20 ఆడారు.

Exit mobile version