Sabarimala Gold Theft: శబరిమల ఆలయానికి చెందిన బంగారు దొంగతన కేసులో నిందితుల ప్రమేయం, వారి ముఠా నెట్‌వర్క్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక ప్రకారం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ సీఈవో పంకజ్ భండారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కోలాం విజిలెన్స్ కోర్టులో SIT దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ ఇద్దరూ ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు పేర్కొంది. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా వీరిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SIT వెల్లడించింది. ఈ కేసుకు అంతర్‌రాష్ట్ర సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తులో తేలింది.
OnePlus Turbo కొత్త సిరీస్.. 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ
శబరిమల ఆలయ ద్వారపు ఫ్రేమ్, ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగారు పూత పలకలను మరమ్మతుల పేరిట చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్‌కు తరలించినట్లు SIT గుర్తించింది. అక్కడి నుంచి బంగారాన్ని వేరు చేసి, దాని ఒక భాగాన్ని బళ్లారి ఆభరణాల వ్యాపారికి విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికే SIT బళ్లారి ఆభరణాల దుకాణం నుంచి సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది దొంగతనంలో భాగమేనని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బంగారాన్ని దాని ఆధ్యాత్మిక విలువ కారణంగా అధిక ధరకు విక్రయించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు సమయంలో గోవర్ధన్, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, పంకజ్ భండారి మధ్య వర్తిగా వ్యవహరించినట్లు SIT గుర్తించింది. ఆలయానికి చెందిన బంగారు పూత పలకల నుంచి సేకరించిన బంగారంలో సుమారు 100 గ్రాములను మరమ్మతుల పారితోషికం పేరిట స్మార్ట్ క్రియేషన్స్‌కు ఇచ్చినట్లు సమాచారం. ఆ బంగారం శబరిమలదేనని భండారికి తెలుసునని కూడా SIT తేల్చింది. ఇదిలా ఉండగా, శబరిమల బంగారు కుంభకోణం దర్యాప్తులో జాప్యంపై కేరళ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) సభ్యులుగా ఉన్న న్యాయవాది ఎన్ విజయకుమార్, కె.పి. శంకర్ దాస్‌లపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.
