NTV Telugu Site icon

Pakistan Record: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. 136 ఏళ్లలో ఇదే మొదటిసారి!

Pakistan Test Cricket

Pakistan Test Cricket

పాకిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఫాలో ఆన్ ఆడి అత్యధిక పరుగులు చేసిన తొలి పర్యాటక జట్టుగా పాక్ చరిత్రకెక్కింది. గత 136 ఏళ్లలో దక్షిణాఫ్రికాలో ఓ విజిటింగ్ టీమ్ ఫాలో ఆన్ ఆడి.. 400 పరుగులకు పైగా చేయడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో 122 సంవత్సరాల క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో 1902లో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును పాక్ బద్దలు కొట్టింది.

దక్షిణాఫ్రికాలో 1902లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్‌ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటి వరకు అదే రికార్డ్‌గా ఉండగా.. తాజాగా పాకిస్థాన్ 478 పరుగులతో బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాకిస్థాన్ (478/10), ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో అత్యధిక ఫాలో ఆన్ రికార్డు ప్రొటీస్ జట్టుపైనే ఉంది. 1999లో డర్బన్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 572 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీ చేయగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలు బాదారు. మహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్ (58), మహమ్మద్ రిజ్వాన్ (46) రాణించారు. కగిసో రబడా మూడు వికెట్లు తీశాడు. పాకిస్థాన్ ఫాలో ఆన్ ఆడి 478 పరుగులు చేసింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజామ్ (81) హాఫ్ సెంచరీ చేశాడు. 58 పరుగుల లక్ష్యంను ప్రొటీస్ 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి విజయం సాధించింది.

Show comments