టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డుల్లోకెక్కాడు. 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వరుణ్ 5 వికెట్స్ (5/17) తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది.
ఓవరాల్‌గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు. ఓ టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా మరో రికార్డు కూడా సృష్టించాడు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
Also Read: SA vs IND: 125 టార్గెట్‌ను కాపాడుకోవడం కష్టమే.. మా కుర్రాళ్లు అద్భుతం: సూర్య
మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మాయ చేశాడు. 125 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మార్‌క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో వరుణ్ కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.