Tony De Zorzi Scores Maiden ODI Century To Guide South Africa Win vs India: ఏకపక్షంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. భారత్ నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ టోని డి జోర్జి (119 నాటౌట్; 122 బంతుల్లో 9×4, 6×6) సెంచరీ చేయగా.. హెండ్రిక్స్ (52; 81 బంతుల్లో 7×4), వాండెర్ డసెన్ (36; 51 బంతుల్లో 5×4) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్ (62; 83 బంతుల్లో 7×4, 1×6), కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో 7×4) అర్ధ సెంచరీలు చేశారు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఇక చివరి వన్డే గురువారం జరుగుతుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ (4) పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సుదర్శన్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. తిలక్ వర్మ (30 బంతుల్లో 10) నెమ్మదిగా ఆడాడు. సుదర్శన్ కూడా నెమ్మదిగానే ఆడినా వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. 12వ ఓవర్లో తిలక్ నిష్క్రమించాడు. ఆ దశలో సుదర్శన్‌కు రాహుల్ తోడయ్యాడు. ఈ ఇద్దరు భారత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. సుదర్శన్ అర్ధ శతకం (65 బంతుల్లో) అనంతరం రాహుల్ దూకుడు పెంచాడు. సుదర్శన్ పెవిలియన్ అనంతరం భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరాడు. సంజు శాంసన్ (12), రింకూ సింగ్ (17) త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. అర్ష్‌దీప్ (18) కాస్త రాణించడంతో భారత్ 200 దాటగలిగింది.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
స్వల్ప ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు జోర్జి, హెండ్రిక్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు. ఈ ఇద్దరు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. ఈ క్రమంలో టోని 55 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వేగం పెంచిన హెండ్రిక్స్ జట్టు స్కోరు 130 వద్ద ఔటయ్యాడు. ఐతే జోర్జి తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. డసెన్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఆఖర్లో డసెన్ ఔట్ అయినా.. మార్‌క్రమ్ (2 నాటౌట్)తో కలిసి జోర్జి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
