NTV Telugu Site icon

SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడో టీ20.. సిరీస్ సమం చేస్తారా?

South Africa Vs India

South Africa Vs India

SA vs IND 3rd T20 Prediction: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ నెగ్గాలంటే వాళ్లు పుంజుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ యువ భారత్‌ సత్తాకు పరీక్ష పెడుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా సొంత గడ్డపై సిరీస్ పట్టేయాలని చూస్తోంది.

ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పోల్చితే భారత్ బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ ఇద్దరు ఇప్పటివరకు 15.50, 11.33 ఎకానమీతో పరుగులిచ్చారు. వ్యక్తిగత కారణాలతో పేసర్‌ దీపక్‌ చహర్‌ అందుబాటులో లేకపోవడం భారత్ బౌలింగ్‌ కష్టాలను పెంచింది. జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్‌ గైర్హాజరీలో అర్ష్‌దీప్‌, ముకేశ్‌లపై విశ్వాసం ఉంచిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు నిరాశ తప్పలేదు. మరి మూడో టీ20లో అయినా ఈ ఇద్దరు రాణిస్తారేమో చూడాలి. టీ20 ప్రపంచకప్‌కు ముందు నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో ఉండాలంటే మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం.

రింకు సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్ బ్యాటింగ్ టీమిండియాకు పెద్ద బలంగా మారింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ మెరుపు ఆరంభాన్నివ్వాలని జట్టు ఆశిస్తోంది. ఒకవేళ రుతురాజ్‌ గైక్వాడ్ కోలుకుంటే.. గిల్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ ఆడే అవకాశముంది. రవీంద్ర జడేజా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పేసర్లు జాన్సన్‌, కొయెట్జీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడం కోసం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడేందుకు జట్టును వీడారు. ప్రొటీస్ బ్యాటింగ్ బలంగా ఉంది.

మ్యాచ్‌ వేదిక జొహానెస్‌బర్గ్‌లో జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మైదానంలో బంతి చాలా వేగంగా బౌండరీకి చేరుతుంది. పేసర్లకు కూడా సహకారం లభించవచ్చు. ఈ వేదికలో అన్ని ఫార్మాట్లలోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. మ్యాచ్ రాత్రి 8.30కి ఆరంభం కానుంది.

Also Read: Margasira Masam: గురువారం ఈ మంత్రం పఠిస్తే సకల సంపదలు చేకూరుతాయి

జట్లు (అంచనా):
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), యశస్వి, శుబ్‌మన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ, జడేజా, అర్ష్‌దీప్‌, కుల్దీప్, సిరాజ్, ముకేశ్‌.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్ ), హెన్‌డ్రిక్స్, బ్రీట్‌కి, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జాన్సెన్, కొయెట్జి, లిజాడ్‌ విలియమ్స్, షమ్సీ.

Show comments