SA vs IND 3rd ODI Prediction: మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. పార్ల్ వేదికగా గురువారం జరిగే చివరి వన్డేలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఢీకొంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో చివరి పోరులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యువ భారత్ చుస్తోంది. భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒక్కసారి (2018లో) మాత్రమే వన్డే సిరీస్ గెలుచుకుంది. అటు దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30కి ఆరంభం కానుంది.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ భారత్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ 5, 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. దాంతో నిర్ణయాత్మక వన్డేలో రుతురాజ్ చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ ఆట కూడా కలవరపెడుతోంది. పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. చివరి అవకాశంగా ఈ మ్యాచ్‌లో తిలక్‌ను ఆడిస్తారా?.. లేదా రజత్ పటీదార్‌కు అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కొచ్చు. రింకూ సింగ్, అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ పుంజుకోవాల్సివుంది. అర్ష్‌దీప్, అవేష్ విజృంభించాలని జట్టు కోరుకుంటోంది.
మరోవైపు రెండో వన్డేలో గెలిచిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. రెండో వన్డేలో సెంచరీ చేసిన టోనీ జోర్జిపై బీభరి ఆశలు ఉన్నాయి. డికాక్ స్థానంలో ఆడుతున్న అతడు ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. మార్కరమ్, హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్, డసెన్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత్ 1-2 మార్పులతో బరిలోకి దిగనుండగా… దక్షిణాఫ్రికా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది. మూడో వన్డేలో పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశముంది.
Also Read: Crime News: ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త! కనిపించట్లేదని డ్రామా
తుది జట్లు (అంచనా):
దక్షిణాఫ్రికా: రిజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.
భారత్: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజిత్ పాటిదార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.