సౌతాఫ్రికా , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హోమ్ టీమ్ సౌతాఫ్రికా విజయానికి అతి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, మార్కో జాన్సన్, సైమన్ హార్మర్ రాణించడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన మార్కో జాన్సన్ ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బతీశాడు.
దీంతో ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించిన సౌతాఫ్రికా జట్టు, మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూలను మరోసారి కట్టడి చేసింది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంకా 170 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో ట్రావిస్ హెడ్ సెంచరీకి చేరువగా ఉన్నప్పటికీ, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లు రావాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికా పటిష్టమైన బౌలింగ్ ఎదురుగా ఆఖరి రోజు మొత్తం ఆటను కాపాడుకోవడం ఆస్ట్రేలియాకు కత్తి మీద సాములాంటి విషయమే.
ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 81.82 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా 60 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే ఆ జట్టు పాయింట్లు పెరుగుతాయి కానీ పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా ఓడిపోయినప్పటికీ 75 శాతంతో నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లకు పాయింట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, సౌతాఫ్రికా మూడో స్థానంలోనే ఉంటాయి. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా స్థానానికి ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, వరుసగా న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా మూడు, బంగ్లాదేశ్ నాలుగు, ఇండియా ఐదు , ఇంగ్లాండ్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

