Site icon NTV Telugu

Putin – Netanyahu: గాజాలోకి రష్యా ఎంట్రీ.. నెతన్యాహుకు పుతిన్ ఫోన్!

Putin Netanyahu

Putin Netanyahu

Putin – Netanyahu: ప్రపంచ వ్యాప్తంగా సంచలన ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాస్తవానికి కొన్ని దేశాలకు ఒకదానికొకటి శత్రుత్వం లేదు, కానీ ఎప్పుడు మాట్లాడుకోని ఆ దేశాలు అకస్మాత్తుగా మాట్లాడుకుంటే, అది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అచ్చంగా అలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది. ఆ దేశాలు ఏంటంటే రష్యా – ఇజ్రాయెల్. ఇందులో విశేషం ఏమిటంటే ఇజ్రాయెల్ అమెరికా శిబిరంలో ఉన్నట్లు ప్రపంచం పరిగణిస్తుంది. అయితే రష్యాకు ఇజ్రాయెల్‌తో ఎటువంటి శత్రుత్వం లేదు. వాస్తవానికి మొదట్లో ఇజ్రాయెల్‌ను గుర్తించిన దేశాలలో రష్యా కూడా ఉంది. గాజా సంక్షోభం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య అరుదైన సంభాషణ జరిగింది.

READ ALSO: Dhanush Srikanth: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు రూ. కోటి 20 లక్షల నజరానా..

ఇద్దరు నేతల మధ్య అరుదైన సంభాషణ..
ఈ ఇద్దరు నాయకుల మధ్య శనివారం జరిగిన ఫోన్ కాల్‌లో అరుదైన సంభాషణ చోటుచేసుకుంది. వారి సంభాషణలో ఆసియాలోని పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్ గురించి వివరంగా చర్చించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం, క్రెమ్లిన్ ఈ సంభాషణను ధృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు, అలాగే ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడి గురించి ఈ ఇద్దరు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్ అణు కార్యక్రమం, సిరియాలో స్థిరత్వం వంటి అంశాలు కూడా వారి చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈ ఫోన్ కాల్‌ను పుతిన్ ప్రారంభించారని, క్రెమ్లిన్ దీనిని రెండు వైపుల మధ్య “గణనీయమైన సంప్రదింపులు”గా అభివర్ణించింది. ఈ అంశంపై ఇద్దరు నాయకులు చర్చించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా పుతిన్ – నెతన్యాహు మధ్య గాజా, మధ్యప్రాచ్యంలోని పరిస్థితి గురించి చర్చలు జరిగాయి. ఆ సమయంలో పాలస్తీనా సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం రష్యా తన మద్దతును పునరుద్ఘాటించింది. ఇరాన్, సిరియాకు సంబంధించిన విషయాలపై ఇద్దరు నాయకులు గతంలో ఒకరినొకరు సంప్రదించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా-రష్యా ఉద్రిక్తతలు సహా అనేక సున్నితమైన అంశాలపై నెతన్యాహు కార్యాలయం రష్యాతో దగ్గరగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ మీడియా నివేదించినప్పుడు కూడా వారు మాట్లాడారు.

వాస్తవానికి ఈ సంభాషణ సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇటీవల రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గాజాపై తన సొంత తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విశ్లేషకులు దీనిని అమెరికా తీర్మానానికి సవాలుగా పేర్కొన్నారు. గాజా కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాలని రష్యా తీర్మానం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని కోరింది. గాజాకు తాత్కాలిక పరిపాలనగా అమెరికా సూచిస్తున్న శాంతి మండలి గురించి ఇందులో ప్రస్తావించలేదు. సంఘర్షణకు శాశ్వత ముగింపు పలికేందుకు వీలు కల్పించే సమతుల్య, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సృష్టించడంలో తన ప్రతిపాదన సహాయపడుతుందని రష్యా పేర్కొంది. ఏది ఏమైనా ఈ ఇద్దరి నాయకుల మధ్య చర్చలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో I-20 కారు యజమాని అరెస్ట్..

Exit mobile version