Site icon NTV Telugu

Russia Ukraine war: తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్

04

04

Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుతుంటే.. మరోవైపు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటునే ఉన్నాయి. మాస్కో-కీవ్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమైంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో యుద్ధాన్ని ముగించడానికి సమావేశమయ్యారు. తర్వాత ట్రంప్ ఆగస్టు 18న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్ హౌస్‌లో సమావేశం అయ్యారు.

READ ALSO: Medipally Murder Case : మేడిపల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

ఇవన్నీ ఒకపక్కన జరుగుతుంటే మరోపక్క గత 3 రోజులుగా రష్యాలోని రోస్టోవ్ ప్రావిన్స్‌లో ఉన్న ఏకైక చమురు శుద్ధి కర్మాగారం మంటల్లో చిక్కుకుంది. ఈ చమురు శుద్ధి కర్మాగారం దక్షిణ రష్యాలోని అతిపెద్ద శుద్ధి కర్మాగారాలలో ఒకటి. నోవోషాఖ్టిన్స్క్ నగరంలో ఉన్న ఈ శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉద్యోగులందరూ సేఫ్..
ప్రమాదంపై రోస్టోవ్ ప్రావిన్స్ యాక్టింగ్ గవర్నర్ యూరి స్ల్యూసర్ మాట్లాడుతూ.. శుద్ధి కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ శుద్ధి కర్మాగారం ప్రధానంగా చమురు ఎగుమతి కోసం పనిచేస్తుంది. దీని వార్షిక ఎగుమతి సామర్థ్యం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు లేదా రోజుకు 1 లక్ష బ్యారెళ్లని సమాచారం.

దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్
ఆగస్టు నుంచి ఉక్రెయిన్ సైన్యం నోవోకుయిబిషెవ్స్క్, సిజ్రాన్, రియాజాన్, వోల్గోగ్రాడ్‌తో సహా అనేక రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలపై అనేకసార్లు దాడులు చేసింది. ఉక్రెయిన్ సైన్యం ఆగస్టు 10 రాత్రి సరతోవ్‌లోని ఒకటి, 13న యునెచా పంపింగ్ స్టేషన్, 14న వోల్గోగ్రాడ్‌లోని ఒక శుద్ధి కర్మాగారం, 15న సమారాలోని సిజ్రాన్ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో నోవోకుయిబిషెవ్స్క్, రియాజాన్, క్రాస్నోడార్‌లోని శుద్ధి కర్మాగారాల్లో మంటల్లో చెలరేగాయి. దక్షిణ రష్యాలోని సోచిలోని ఒక చమురు డిపోపై కూడా ఉక్రెయిన్ దాడి చేసింది. ఇదిలా ఉంటే శనివారం రష్యా సైన్యం పూర్వపు డోనెట్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. సెరెడ్నే, క్లెబన్-బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉన్నాయి.

READ ALSO: Dharmasthala case: భీమా పచ్చి అబద్ధాలకోరు.. మాజీ భార్య తీవ్ర ఆరోపణలు

Exit mobile version