Site icon NTV Telugu

Rukhmabai Raut: చట్టపరంగా విడాకులు సాధించిన తొలి హిందూ మహిళ ఎవరంటే?

Rukhmabai Raut

Rukhmabai Raut

Rukhmabai Raut: భారత చరిత్రలో మహిళల హక్కుల కోసం మొట్టమొదటగా చట్టపరమైన పోరాటం చేసిన వ్యక్తిగా రుఖ్మాబాయి రౌత్ చరిత్రలో నిలిచారు. 1885లో ఆమె కేసు దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచించింది. ఆ తర్వాత కాలంలో 1891లో వయస్సు పరిమితి చట్టం (Age of Consent Act) ఆమోదానికి దారితీసింది. ఈ కేసుతో చిన్న వయసులో వివాహం అనే సంప్రదాయాన్ని చట్టపరంగా రద్దు చేసే మార్గం సుగమమైంది.

రుఖ్మాబాయి భీమ్రావ్ రౌత్ 1864 నవంబర్ 22న ముంబైలో జన్మించారు. ఆమె తల్లి కూడా చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది. తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో, ఆమె తల్లి డా. సఖారామ్ అర్జున్ రౌత్‌ను తిరిగి వివాహం చేసుకున్నారు. ఆయన మద్దతుతో రుఖ్మాబాయి విద్యలో ఆసక్తి పెంచుకుని, మహిళా హక్కుల కోసం పోరాడే ఆత్మవిశ్వాసం పొందారు. అయితే, సంప్రదాయాల ప్రకారం రుఖ్మాబాయి కేవలం 11 ఏళ్ల వయసులో 19 ఏళ్ల దాదాజీ భికాజీతో వివాహం జరిగింది. కానీ, ఆమె తన సవతి తండ్రి సహకారంతో ఇంట్లోనే ఉండి చదువును కొనసాగించారు.

Silver Hallmarking: వెండి బంగారం కాను..! హాల్ మార్కింగ్‌తో వెండి ధరలకు రెక్కలు

అలా కొన్ని రోజుల తర్వాత 1884లో దాదాజీ తనతో కలసి నివసించమని అడగగా దానికి రుఖ్మాబాయి తిరస్కరించారు. దీనితో కేసు బాంబే హైకోర్టుకు చేరింది. తొలుత న్యాయమూర్తి రాబర్ట్ హిల్ పిన్హే రుఖ్మాబాయి వైపు తీర్పు ఇచ్చినా, అప్పీల్‌లో 1887లో మరో బెంచ్ ఆమెను భర్త దగ్గరికి వెళ్లమని లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించమని తీర్పునిచ్చింది.

పరిస్థితి ఈవిధంగా ఉన్నాకానీ రుఖ్మాబాయి జైలుకు వెళ్ళడానికే సిద్ధమయ్యారు. ఈ ధైర్యం దేశంలోనే కాకుండా బ్రిటన్‌లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. రామాబాయి రణాడే, బెహ్రమ్జీ మలబారి వంటి సామాజిక సంస్కర్తలు ఆమెకు మద్దతు ఇచ్చారు. చివరకు ఆమె వ్యాసాలు క్వీన్ విక్టోరియా దృష్టికి వెళ్లడంతో, 1888లో రుఖ్మాబాయి పెళ్లి రద్దు అయ్యింది. ఇది భారతీయ మహిళల చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది.

Asia Cup 2025: 15 మందిలో ఆ ముగ్గురే గేమ్‌ ఛేంజర్లు.. సెహ్వాగ్ లిస్టులో లేని స్టార్స్!

కోర్టు కేసు ముగిసిన అంతరం రుఖ్మాబాయి లండన్‌ లోని లండన్ స్కూల్ అఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ లో చదివి 1893లో వైద్య పట్టా పొందారు. ఆ తరువాత భారత్‌కి వచ్చి సూరత్‌ లోని మహిళల ఆసుపత్రిలో 35 ఏళ్ల పాటు సేవలందించారు. ఆమెను భారత తొలి మహిళా వైద్యులలో ఒకరిగా చెప్పుకుంటారు. ఈ కాలంలో ఆమె “A Hindu Lady” అనే కలం పేరుతో ప్రముఖ పత్రికలో వ్యాసాలు రాశారు. వీటిలో మహిళా హక్కులు, విద్య, చిన్న వయసులో పెళ్లి వ్యతిరేకత వంటి అంశాలను వ్యక్తపరిచారు. రుఖ్మాబాయి పోరాటం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాక, భారత మహిళా విముక్తి ఉద్యమానికి పునాది. ఆమె ధైర్యం వల్లే తదుపరి తరాల మహిళలు హక్కుల కోసం పోరాడే స్థితి వచ్చింది. 1955లో ఆమె మరణించినప్పటికీ, రుఖ్మాబాయి పేరు భారత మహిళా స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

Exit mobile version