Site icon NTV Telugu

Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగ్‌ పైనే కుప్పకూలి..!

Rtc Driver Heart Attack

Rtc Driver Heart Attack

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతుండగానే హార్ట్ ఎటాక్ రావడంతో.. స్టీరింగ్‌ పైనే కుప్పకూలిపోయాడు. దాంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

గురువారం రాత్రి ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు కావలి నుంచి బెంగళూరుకు బయలు దేరింది. ఈరోజు తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మదనపల్లి రోడ్డులోకి రాగానే.. డ్రైవర్‌ రసూల్‌ (50)కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన స్టీరింగ్‌పై అలానే కుప్పకూలారు. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న బైక్ పైకి బస్సు దూసుకెళ్లింది. ఆపై బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించినా.. అతడు అప్పటికే మృతి చెందాడు.

Also Read: Peddapuram Prostitution: పెద్దాపురం వ్యభిచారం కేసు.. వెలుగులోకి సంచలన విషయం!

ఈ ఘటనలో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్ నుజ్జు నుజ్జయింది. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు బస్సును ప్రమాద స్థలం నుంచి రాయచోటి ఆర్టీసీ డిపోకు తరలించారు. డ్రైవర్ రసూల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సీఐ విశ్వనాథ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయంను రసూల్ కుటుంబ సభ్యులకు తెలిపారు.

Exit mobile version