Site icon NTV Telugu

Rohit Sharma: మోకాలిపై కూర్చొని రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశా.. ఆమె నా అదృష్ట దేవత!

Rohit Sharma Love

Rohit Sharma Love

తన సతీమణి రితిక సజ్‌దేశ్‌కు చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసినట్లు టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. తాను క్రికెట్‌ ప్రారంభించిన ప్రాంతానికి రితికను తీసుకెళ్లి.. పిచ్‌పై మోకాలిపై కూర్చొని తన ప్రేమను తెలియజేసినట్లు చెప్పాడు. ఆ క్షణాలను కెమెరాలో బంధించామని, రితికనే తన అదృష్ట దేవత అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి భార్య గీతా బాస్రాల టాక్ షోలో హిట్‌మ్యాన్ సతీసమేతంగా పాల్గొని తన ప్రేమకు సంబదించిన విషయాలు పంచుకున్నాడు.

‘నేను చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశా. ఆ రోజు నేను, రితిక మెరైన్‌ డ్రైవ్‌ దగ్గర ఉన్నాం. రితిక ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చింది. ఇద్దరం అక్కడే తినేశాం. ఆ తర్వాత బోర్‌ కొడుతోందని చెప్పి.. ఐస్‌క్రీమ్‌ తిందామని రితికతో అన్నాను. కారులో ఇద్దరం బయల్దేరాం. మెరైన్‌ డ్రైవ్, హాజి అలీ, వోర్లి, బాంద్రా దాటాం. దాంతో ఐస్‌క్రీమ్‌ షాప్‌ ఎక్కడ? అని అడిగింది. బాంద్రా అవతల రితికకు సరిగా తెలియదు. నేను నివసించే బోరివాలీలో మంచి షాప్‌ ఉందని చెప్పను. నువ్వెప్పుడూ అక్కడికి రాలేదని, ఈరోజు నీకు చూపిస్తానన్నాను. కాసేపటికి ఇద్దరం స్టేడియానికి చేరుకున్నాము. అప్పటికే నా ప్రపోజల్ సన్నివేశాన్ని కెమెరాల్లో బంధించాలని నా స్నేహితుడిని కోరాను. చీకటిగా ఉండటంతో అది మైదానం అని రితికాకు తెలియలేదు. పిచ్ దగ్గర కారు ఆపి.. మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశా’ అని రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

Also Read: ENG vs IND: అబ్బో.. జస్ప్రీత్ బుమ్రాతో చాలా కష్టం: బెన్‌ డకెట్‌

రితిక సజ్‌దేశ్‌, రోహిత్‌ శర్మలు 2008లో తొలిసారి కలుసుకున్నారు. యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలకు మేనేజర్‌గా పనిచేసిన రితిక.. ఆపై రోహిత్‌ వద్దకు వచ్చింది. 2013లో ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2015లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రోహిత్, రితికాలకు 2018లో సమైరా పుట్టగా.. 2024 నవంబర్లో అహాన్ జన్మించాడు. రోహిత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు రితిక హాజరై ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఆగస్టు 17 నుండి 23 వరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. ఒకవేళ బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడినా లేదా రద్దైనా.. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతాడు.

Exit mobile version