వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించడం ఒక ఎత్తయితే, దానిని మహామహులకూ సాధ్యంకాని స్థాయిలో పర్వతంలా నిలపడం మరొక ఎత్తు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు 11 మంది బ్యాటర్లు (మొత్తం 14 సార్లు) 200 పరుగుల మైలురాయిని దాటారు. రోహిత్ శర్మ 3 సార్లు, శుభ్‌మన్ గిల్ 2 సార్లు డబుల్ సెంచరీలు చేయగా.. సచిన్, సెహ్వాగ్, గైల్, గప్తిల్, ఫఖర్ జమాన్, నిస్సాంక, ఇషాన్ కిషన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఇటీవల శ్రీలంకపై 202 పరుగులు చేసిన హారీ బ్రూక్ తలో ఒకసారి ఈ ఘనత సాధించారు.
ఈ చారిత్రాత్మక జాబితాలో రోహిత్ శర్మ రికార్డు మాత్రం దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా శిఖరాగ్రాన నిలిచింది. 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై రోహిత్ సాధించిన 264 పరుగుల సునామీ ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా చెరగని ముద్ర వేసింది. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన ఆ ఇన్నింగ్స్ ఒక అద్భుతం. ఒక్క వన్డేల్లోనే మూడు ద్విశతకాలు సాధించి ‘హిట్‌మ్యాన్’గా చరిత్రకెక్కిన రోహిత్ రికార్డును అందుకోవడం ఆధునిక క్రికెట్‌లో దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
ఈ ఆల్-టైమ్ రికార్డును భవిష్యత్తులో ఎవరు బ్రేక్ చేయగలరనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ప్రస్తుతం ఉన్న విధ్వంసకర ఫామ్, మైండ్ సెట్ చూస్తే టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఆ సత్తా ఖచ్చితంగా ఉంది. అతడికి ఉన్న సహజసిద్ధమైన పవర్-హిట్టింగ్, మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడే నైపుణ్యం చూస్తుంటే, సుదీర్ఘంగా క్రీజులో నిలబడితే రోహిత్ రికార్డును కూడా ముప్పుతిప్పలు పెట్టగల సామర్థ్యం అతనికి ఉందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే రెండుసార్లు (223*, 208) డబుల్ సెంచరీలు బాదిన గిల్, మైదానంలో సుదీర్ఘ సమయం ఆడే టెక్నిక్ ఉన్న ఆటగాడు. ఇతడు కూడా ఆ రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. ఇక.. విధ్వంసకర స్ట్రైక్ రేట్‌తో ఆడే హారీ బ్రూక్ అండ్ ఇషాన్ కిషన్ క్రీజులో 40 ఓవర్ల పాటు నిలిచే అవకాశం వస్తే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. అయితే ఎంతమంది కొత్త రికార్డులు క్రియేట్ చేసినా, వన్డే క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో ‘డబుల్ సెంచరీల రాజు’ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు మాత్రం ఎప్పటికీ రోహిత్ శర్మదే.

